ఆ రాత్రి అందరూ పడుకున్నాక కూడా ఉమాదేవికి నిద్ర రాలేదు. హాల్లో దీపం ఆరిపోయింది. వంటింటి పాత్రల చప్పుడు మసకబారిపోయింది. గడియారం ముళ్లు మాత్రమే ఇంటి నిశ్శబ్దాన్ని కొలుస్తున్నాయి.
తెల్లవారుజాము వరకూ అలాగే గడిపింది. తరువాత లేచి స్నానం చేసి చీరకట్టుకుని అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటోంది ఉమాదేవి.
ఆ సాయంత్రం అపార్ట్‌మెంట్ ఆడవాళ్ల ముందున్న ఉమాదేవి ఇప్పుడు అక్కడ లేదు. వాళ్ల ప్రశ్నలకు నవ్వుతూ జవాబిచ్చిన ధైర్యవంతురాలు కూడా లేదు. అద్దంలో నిలిచింది—చీర మడతల మధ్య తనను తాను వెతుక్కుంటున్న ఒక మనిషి.
మెడలోని నల్లపూసలను వేళ్లతో తాకింది. ఆ తాకిడిలో వేషం లేదు. ఏదో ఒక వింత నిబద్ధత ఉంది. నుదుటి కుంకుమను చూసింది. పాపిడిలోని సిందూరాన్ని చూసింది. ఇవన్నీ తనవి కావు అనిపించలేదు. పూర్తిగా తనవి అనిపించడానికి కూడా ఇంకా ఒక దూరం ఉంది. ఆ దూరమే బహుశా తన జీవితం అంతా అయి ఉండొచ్చని అనిపించింది.
“ఉమా…”
ఆ స్వరం ఎక్కడినుంచి వచ్చిందో తెలియలేదు. కానీ అతనికి అది కొత్త కాదు. చిన్నప్పుడు తల్లి పిలిచిన స్వరమే అది. గదిలో ఎవరూ లేరు. అయినా ఆ స్వరం అద్దంలోనుంచి వచ్చినట్టుగా అనిపించింది.
“చీర మడత ఇలా కాదు రా,” అని తల్లి ఒకప్పుడు నవ్వుతూ చెప్పిన జ్ఞాపకం మెదిలింది.
ఆ రోజులలో తల్లి పాత వెంకటగిరి చీరను తీసుకుని, “ఇది ఆట కాదు ఉమా. చీర కట్టడం అంటే బట్ట కట్టుకోవడం కాదు. దానిలో ఒక విధానం ఉంటుంది. మర్యాద ఉంటుంది. బాధ్యత ఉంటుంది,” అని చెప్పేది. అప్పటికి అతనికి ఆ మాటల అర్థం రాలేదు. తల్లి గదిలో తలుపు వేసుకుని, ఆమె చూపించినట్టు చీర మడతలు వేసుకునేవాడు. తల్లి నవ్వేది కాదు. ఎగతాళి చేసేది కాదు. ఆమెలో ఏదో ఒక గంభీరమైన కరుణ ఉండేది.
“ఒకరోజు నీకు అర్థమవుతుంది,” అనేది.
ఆ ఒకరోజు ఇంత ఆలస్యంగా వస్తుందని అతను ఊహించలేదు.
ఉమాదేవి అద్దం దగ్గర కుర్చీని లాగి కూర్చుంది. చేతులు మోకాలిపై వేసుకుంది. హాల్‌లోని మసక వెలుతురులో ఆమె నీడ గోడమీద పొడవుగా పడింది. ఆ నీడలో ఉమామహేశ్వరరావు కనిపించలేదు. రాజేశ్వరి భర్త కనిపించలేదు. హేమ, రమల తండ్రి కనిపించలేదు. పదేళ్లు ఉమాదేవి పేరుతో కథలు రాసిన రచయిత కూడా పూర్తిగా కనిపించలేదు.
కనిపించింది—ఏదో మాట నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతున్న ఒక మనిషి.
తల్లి చివరి రాత్రి గుర్తొచ్చింది. ఆసుపత్రి గదిలో యంత్రాల శబ్దం నెమ్మదిగా వినిపిస్తుండగా, తల్లి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. వేళ్లు చల్లబడుతున్నాయి. కానీ స్వరం మాత్రం స్పష్టంగానే ఉంది.
“ఉమా,” అంది.
“అమ్మా…”
“కోడల్ని కష్టపెట్టకు.”
“అమ్మా, అలాంటి మాట ఎందుకు?”
“నువ్వు మంచివాడివి. కానీ మంచివాళ్లకీ అర్థం కాని కష్టాలు ఉంటాయి. ఆడది ఇంట్లో పడే శ్రమను మగవాడు చూస్తాడు, కాని పూర్తిగా అనుభవించడు. కనీసం ఆరు నెలలు పూర్తి మహిళగా ఉండి చూడు. చీర కట్టుకుని, వంటింట్లో నిలబడి, ఇంటి చూపులు మోసుకుని, మాటలు మింగుకుని, మర్యాదను కాపాడుకుంటూ (ఈ మాటలను వత్తి పలుకుతూ) ఒకరోజు కాదు—నెలలు గడుపు. అప్పుడు కోడల్ని అర్థం చేసుకుంటావు.”
అతను తల్లి చేతిలో చెయ్యి పెట్టాడు.
“మాట ఇస్తావా?”
“ఇస్తాను అమ్మా.”
ఆ మాట అప్పటినుంచి అతని లోపల ఒక మూసిన పెట్టెలా ఉండిపోయింది. ఉద్యోగం, రచనలు, పేరు, కుటుంబం—అన్నీ ఆ పెట్టె మీద పేరుకున్నాయి. ఇప్పుడు ఆ పెట్టె తలుపు తెరచుకుంది.
ఉమాదేవి అద్దంలో తనను తాను మరలా చూసుకుంది.
అద్దంలోని రూపం ఆమెను చూస్తోంది. ఆ చూపులో ప్రశ్న లేదు. తీర్పు లేదు. కేవలం ఒక ఆహ్వానం మాత్రమే ఉంది. అద్దంలోని తనలో అమ్మ కనబడుతోంది. అంటే తను అమ్మకి ప్రతిబింబమా?
“ఇక వెనక్కి వెళ్లకు,” అని ఆ రూపం చెప్పినట్టనిపించింది. “నువ్వు వేసుకున్నది వేషం కాదు. నువ్వు నిలబెట్టుకోవాల్సిన మాట. నువ్వు రాయాల్సిన చివరి కథ. ఇకపై నువ్వు ఉమాదేవివే.”
ఆమె కళ్లలో నీరు తిరిగింది. అది దుఃఖం కాదు. విముక్తి కూడా కాదు. రెండింటి మధ్య నిలిచే ఒక నిశ్శబ్ద అంగీకారం.
అప్పుడే లోపలి గదిలో రాజేశ్వరి దగ్గుతోంది. ఉమాదేవి తొందరగా కళ్లను తుడిచుకుంది. అద్దం ముందు నుంచి లేచి, నెమ్మదిగా లోపలికి నడిచింది.
ఆ రాత్రి మొదటిసారి, చీర అంచు నేలను తాకిన శబ్దం ఆమెకు తన అడుగుల శబ్దంలా కాక, తల్లి మాటల ప్రతిధ్వనిలా అనిపించింది. కారణం తల్లితో ఈ సంభాషణ ఈనాటిది కాదు. కొన్ని సంవత్సరాల నాటిది.
ఇంతలో ఉమాదేవికి పొలమారింది. తెరలు తెరలుగా దగ్గు వచ్చింది. వెంటనే ఎవరూ చూడకుండా వాళ్ళ నిద్రకు భంగం రానివ్వకుండా నెమ్మదిగా మంచినీళ్ళు తాగి కుదుట పడింది. తరువాత తన పనులకు ఉపక్రమించింది.
Discussion (2)
Nice concept keep going
Thank you very much sister Sandhya...