యాజులు సంఘటన తర్వాత రెండు రోజులు అపార్ట్‌మెంట్ కారిడార్‌లు కొంచెం మౌనంగా ఉన్నాయి. యాజులు కింద పార్కింగ్ దగ్గర ఉమాదేవిని చూసినా, కనిపించనట్టు మొహం తిప్పి వెళ్లేవాడు. సుబ్బలక్ష్మి మాత్రం ఆ సంగతి ఎవరికీ బహిరంగంగా చెప్పలేదు. కానీ ఆడవాళ్ల మధ్య మాటలకంటే మౌనాలకే ఎక్కువ రెక్కలు ఉంటాయి. యాజులు ఉమాదేవి ఇంట్లోకి వెళ్లి వెంటనే ఎందుకు పారిపోయాడో ఎవ్వరూ అడగలేదు; కానీ ఎవరికి వాళ్లు తమ తమ అంచనాలు వేసుకున్నారు. ఉమాదేవి మాత్రం ఆ రోజునుంచి తలుపు తీయడంలో మరింత జాగ్రత్త పడింది. తలుపు పూర్తిగా తెరవకుండా ముందుగా గడియారం బెల్ వెనకున్న కళ్లద్దం గుండా చూసేది. హేమ సెట్ చేసిన ఫోన్ రికార్డర్ షార్ట్‌కట్ ఆమెకు ఒక చిన్న ఆయుధంలా మారింది. తల్లి మాట నిలబెట్టుకోవడం అంటే కేవలం చీర మడతలు నేర్చుకోవడం కాదు; ప్రపంచం వేసే మడతల్ని కూడా గుర్తించడం అని ఆమెకు మెల్లగా అర్థమవుతోంది. ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో రాజేశ్వరి లేదు. బ్యాంక్‌లో ఆడిట్ ఉందని ఉదయమే వెళ్లిపోయింది. హేమ, రమ కాలేజీకి వెళ్లారు. ఉమాదేవి వంటగది పనులు ముగించుకుని హాల్లోకి వచ్చింది. కిటికీ దగ్గర కూర్చుని పాత పేపర్ల కట్టలోంచి ఒక చిన్న డైరీ తీసుకుంది. సుబ్బలక్ష్మి కథ నిన్న రాత్రి అక్కడ మొదటి వాక్యంగా మిగిలింది. దానికింద ఇంకో వాక్యం రాయబోతుండగానే తలుపు బెల్ మోగింది. ఆమె లేచి తలుపు దగ్గరకు వెళ్లింది. బయట గోవిందరాజులు నిలబడి ఉన్నాడు. గోవిందరాజులు అపార్ట్‌మెంట్‌లో అందరికీ తెలిసిన మనిషి. అతనికి రెండు క్యాబ్‌లు, ఒక టెంపో ట్రావెలర్, ఒక మినీ బస్సు ఉన్నాయి. పెళ్లిళ్లకు, యాత్రలకు, ఎయిర్‌పోర్ట్ డ్రాప్‌లకు, పిక్నిక్‌లకు అతని వాహనాలే చాలామందికి గుర్తొచ్చేవి. అందుకే అతని మాటల్లో ఎప్పుడూ ఒక వ్యాపారి చనువు ఉండేది. కానీ ఆ రోజు అతని చనువులో వ్యాపారంకన్నా మరేదో ఎక్కువగా ఉంది. “ఏమండీ?” తలుపు సగమే తెరిచి ఉమాదేవి అడిగింది. “అయ్యో, తలుపు అంతా తెరువు వదినా. నేనే గోవిందరాజులు. రంగనాయకి మా వాళ్లు చెప్పలేదా?” అన్నాడు. “చెప్పారు. రండి,” అంది ఉమాదేవి. కానీ తలుపు తెరిచిన తీరు ఆహ్వానం ఉన్నా, హద్దు ఉన్నట్టే ఉంది. అతను లోపలికి వచ్చి హాల్‌లో చుట్టూ ఒకసారి చూశాడు. ఆ చూపులో ఇంటి అలంకరణ చూడాలనే ఆసక్తి కంటే, ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని చూసే జాగ్రత్త ఎక్కువగా ఉంది. “ఇంట్లో ఎవరూ లేనట్టుండాది,” అన్నాడు చిరునవ్వుతో. ఉమాదేవి అతని మాటలోని మొదటి ముళ్లను గుర్తించింది. అయినా ముఖంలో మార్పు రానీయలేదు. “ఇల్లు ఖాళీగా ఉండదు అన్నయ్యగారూ. పనులు ఉంటాయి. ఫోన్లు ఉంటాయి,” అంది. “అయ్యో, అన్నయ్యగారూ అంటావేంటి! నువ్వు నాకంటే శానా చిన్నదానిమల్లె ఉండావు. నీకు ఓ ముప్పై ఉంటాయా?” అన్నాడు. అతని మాటల్లో పొగడ్త దుప్పటి వేసుకున్న చనువు ఉంది. ఉమాదేవి కళ్లలో క్షణం చిరునవ్వు మెరిసింది. ఆ చిరునవ్వు ఆనందం కాదు; ఎదుటివాడి పాదం ఎక్కడికి వస్తుందో కొలిచే నిగ్రహం. “వయసులు అడిగే పనులు డాక్టర్లు చేసుకుంటారు గోవిందరాజులుగారూ,” అంది. “మీరు కూర్చోండి.” “అయ్యో గోవిందరాజులుగారూ కాదు. మన వాళ్లం కదా. గోవిందన్నా అనొచ్చు.” “సరే అన్నా,” అంది ఉమాదేవి వెంటనే. ఆ ఒక్క మాటతో అతను క్షణం ముచ్చటపడ్డాడు. తాను కోరుకున్న చనువుకే ఆమె మాటిచ్చిందనుకున్నాడు. కానీ ఆ చనువు తనను ఎక్కడికి తీసుకెళ్లబోతోందో అతనికి ఇంకా తెలియదు. “రంగనాయకి సెప్పింది,” అంటూ అతను సోఫాలో కూర్చున్నాడు. “మీరు ఇక్కడికి కొత్తట. ముంబై అంట. మన ఊరి ప్రదేశాలు ఇంకా చూడలేదేమో. రేపు ఒక మాలి అల్లా ఊరు చూపిత్తా. ఫ్రీగానే. నాకేం ఖర్చు లేదు. నా క్యాబ్ ఉంది కదా.” “అవసరం లేదు అన్నా. రాజేశ్వరి ఉంటే చూస్తాం,” అంది ఉమాదేవి. “అయ్యో, రాజేశ్వరి వాళ్ల పని వాళ్లకుంటుంది. ఆఫీస్ ఆఫీస్. నువ్వు రోజంతా ఇంట్లో ఒంటరిగా. బోర్ కొడుతుందిగా. ఒక మాలి అలా బయటికి వెళ్తే నీకూ మార్పు, నాకూ పుణ్యం.” అతను నవ్వాడు. ఆ నవ్వులో పుణ్యం తక్కువ, ప్రయోజనం ఎక్కువ. “పుణ్యం ఇంట్లోనూ సంపాదించొచ్చు అన్నా. కాఫీ తాగుతారా?” అని ఉమాదేవి అడిగింది. “ముందు ఇది చూడు,” అని అతను తన చేతిలోని పెద్ద ప్లాస్టిక్ కవర్ తెరిచాడు. అందులో కొన్ని సైట్‌సీయింగ్ ఆల్బమ్‌లు ఉన్నాయి. కొండలు, దేవాలయాలు, డ్యామ్‌లు, బీచ్‌లు, రిసార్టులు—అన్నీ గట్టిగా లామినేట్ చేసిన ఫోటోలు. వ్యాపారం కోసం తయారు చేసిన ఫోల్డర్లు. కానీ ఆ రోజు అవి అతనికి మరో కారణానికి ఉపయోగపడుతున్నాయి. “ఇది చూడు. ఇది మా టెంపో ట్రావెలర్. సీట్లు చాలా కంఫర్ట్. ఇది చూడు— ఇదిక్కడ పెద్ద పార్క్. ఇది చూడు—అరుకు కాదు, మన దగ్గరే చిన్న హిల్ పాయింట్. ఇది చూడు…” అంటూ ఫోటో చూపించే వంకతో అతను ఆమె వైపు దగ్గరికి కదిలాడు. ఉమాదేవి సోఫా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను ఆల్బమ్‌తో ఆమె పక్కకే వచ్చి నిలబడ్డాడు. “ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది,” అన్నాడు. “నాకిక్కడినుంచే కనిపిస్తోంది,” అంది ఆమె. “లేదు లేదు, దగ్గరగా చూడు. ఫోటో క్లారిటీ మస్తు ఉంది,” అన్నాడు. ఆల్బమ్ అంచు ఆమె చేతికి తగిలేలా వంగాడు. ఒక విధమైన భరించలేని చెమట వాసన.ఆల్కహాల్ వాసన. ఉమాదేవి కొంచెం పక్కకు జరిగి కూర్చుంది. అతను మళ్లీ మరో ఫోటో తిప్పాడు. “ఇది చూడు. ఇక్కడ కూర్చుంటే చల్లగాలి. మనిద్దరం—అంటే…” అని ఒక్క క్షణం తడబడి వెంటనే సరిచేసుకున్నాడు. “మన వాళ్లం వెళ్లినప్పుడు మస్తు ఉంటుంది.” ఆ “మనిద్దరం” అనే జారి వచ్చిన మాట గదిలో కొద్ది క్షణాలు నిలిచి పోయింది. ఉమాదేవి దానిని పట్టుకుని గొడవ చేయలేదు. అలాంటి మాటలను వెంటనే పట్టుకుంటే అవి ఎదుటివాడికి గొడవగా మారతాయి; వాటిని జాగ్రత్తగా నిల్వచేసి సరైన చోట వదలాలి అని ఆమె ఇప్పుడు నేర్చుకుంది. “రాజేశ్వరి అడిగి చెబుతాను అన్నా,” అంది. “అయ్యో అడగడం ఎందుకురా… అంటే ఎందుకమ్మా? ఒక రోజు వెళ్లి వస్తాం. ఉదయాన్నే బయల్దేరి సాయంత్రం ముందు వస్తాం. నిన్ను నేనే తీసుకెళ్తా. ఫ్రీగానే. నీకోసమే.” అతని స్వరం చివరికి పలుచగా మారింది. ఆ పలుచదనం స్నేహం కాదు; అపరిచితాన్ని మచ్చిక చేసుకోవాలనే ప్రయత్నం. అతను ఫోటో చూపిస్తున్న చేతితో ఆమె కుర్చీ అంచు పట్టుకున్నాడు. మరో అడుగు దగ్గరకు వచ్చాడు. ఉమాదేవి లేచింది. “నేను నీళ్లు తీసుకువస్తాను,” అంది. “అయ్యో, నీళ్లు తర్వాత. ముందు ఇది చూడు,” అంటూ అతను ఆల్బమ్ ఆమె చేతుల్లో పెట్టాడు. పెట్టేటప్పుడు అతని వేళ్లు అవసరానికి మించి ఆమె చేతిని తాకాయి. ఆమె పక్కకు తప్పుకుంది. “చూడండి అన్నా, ఫోటోలు అక్కడ టేబుల్ మీద పెట్టండి. నేను కూర్చుని చూస్తాను,” అంది. “ఇది నిలబడి చూస్తేనే బాగుంటుంది,” అన్నాడు అతను. మళ్లీ దగ్గరికి వచ్చాడు. ఆ క్షణంలో ఉమాదేవి చేతి వేళ్లు నెమ్మదిగా మొబైల్ సైడ్ బటన్ వైపు జారాయి. రికార్డర్ మొదలైనట్టుగా చిన్న కంపనం ఆమె చేతికి తెలిసింది. “ఇది చూడు… ఇది చూడు…” అంటూ గోవిందరాజులు మరింత దగ్గరయ్యాడు. తలుపు బెల్ మోగింది. ఆ శబ్దం ఇంటి లోపల ఒక శరణ్యంలా వినిపించింది. గోవిందరాజులు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఉమాదేవి మొబైల్ చేతిలోనే ఉంచుకుని తలుపు తెరిచింది. బయట సుమతి, సుబ్బలక్ష్మి నిలబడి ఉన్నారు. “వదినా!” సుబ్బలక్ష్మి లోపలికి చూడగానే ముఖంలో ఆనందం విరిసింది. “రాజేశ్వరి చెప్పింది. మీ ఆయన డి.ఐ.జీ. అంటగా! చాలా సంతోషం వదినా.” సుమతి వెంటనే జతచేసింది. “అవునమ్మా. మనకు పరిచయం ఉన్నవాళ్లలో ఇంత పెద్ద ఆఫీసర్ ఉండడం గర్వంగా ఉంది.” గోవిందరాజులు ముఖం ఒక్కసారిగా తెల్లబడింది. అతని చేతిలోని సైట్‌సీయింగ్ ఆల్బమ్ బరువెక్కినట్టయింది. “డి… డి.ఐ.జీ.నా?” అని అతను తెలియకనే అడిగాడు. ఉమాదేవి అతని వైపు చూసింది. పెదవుల దగ్గర చిరునవ్వు ఉంది. కానీ కళ్లలో స్పష్టమైన జాగ్రత్త ఉంది. “అయ్యో, మీకు చెప్పలేదా అన్నా?” అంది. “లేదు… అంటే… నేను…” “ఒక్క నిమిషం అమ్మా,” అని సుమతి, సుబ్బలక్ష్మి వైపు తిరిగి అంది. “గోవిందన్నా నాకు చాలా మంచి ఆఫర్ చెప్పడానికి వచ్చారు. రేపు ఊరు చూపిస్తానన్నారు.” సుమతి కనుబొమ్మలు పైకెగిరాయి. సుబ్బలక్ష్మి ముఖంలో విషయం అర్థమైన జాగ్రత్త కనిపించింది. ఉమాదేవి వెంటనే గోవిందరాజుల వైపు తిరిగింది. “అన్నా, నువ్వు చెప్పినట్లే వెళ్దాం అన్నా. కానీ నేను ఒంటరిగా ఎందుకు? మన ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్దాం. రేపు ఆదివారం కదా. లాంగ్ ట్రిప్ పెట్టేద్దాం.” గోవిందరాజులు నోరు తెరిచి మూసుకున్నాడు. “అదీ… అది…” అన్నాడు. “ఏముంది అన్నా? నువ్వే అన్నావుగా ఫ్రీ అని. కానీ ఫ్రీగా కాదు. బిజినెస్ బిజినెస్‌లా ఉండాలి. రెండు బస్సులు ఏర్పాటు చెయ్యన్నా. ఒకటి మన అపార్ట్‌మెంట్ ఆడవాళ్ల కుటుంబాలకు. ఇంకొకటి పిల్లలకోసం. రాజేశ్వరి బ్యాంక్ వాళ్లలో ఎవరికైనా రావాలనిపిస్తే వాళ్లకూ చెప్పొచ్చు.” సుబ్బలక్ష్మి వెంటనే చప్పున అంది, “అయ్యో చాలా బాగుంటుంది వదినా! మన సుబ్బారావుని కూడా తీసుకెళ్తాను. ఎప్పుడూ బయటికి తీసుకెళ్లడు.” సుమతి మరింత ఉత్సాహంగా, “మా వాళ్లు మొదట అంగీకరించరు. కానీ డి.ఐ.జీ. గారి ఇంటి వాళ్లు కూడా వస్తారంటే తప్పకుండా వస్తారు,” అంది. గోవిందరాజులు ముఖంలో ఇప్పుడు అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. అతను ఒంటరి ప్రయాణం అనుకున్న చోట రెండు బస్సుల యాత్ర నిలిచింది. మాట కలపడానికి వచ్చిన చోట, తన వ్యాపారమే తనపై తిరిగి పడింది. “రెండు బస్సులా?” అన్నాడు కష్టంగా. “అవును అన్నా. నువ్వే క్యాబ్స్, టెంపో ట్రావెలర్స్ నడుపుతావుగా. మన వాళ్లకి నీ సర్వీస్ తెలిస్తే నీకే బిజినెస్. ఎంత మంచిది! నేను ఇప్పుడే రాజేశ్వరికి చెబుతాను. ఆమే అపార్ట్‌మెంట్ గ్రూపులో మెసేజ్ పెడుతుంది.” “లేదు లేదు… నేను అలా అనలేదు. అంటే… చిన్నగా… ఒక క్యాబ్‌లో…” “ఒక క్యాబ్‌లో ఎలా సరిపోతాం అన్నా?” ఉమాదేవి అమాయకంగా అడిగింది. “సుమతిగారు, సుబ్బలక్ష్మిగారు, రంగనాయకి, వాళ్ల వాళ్లు, పిల్లలు, రాజేశ్వరి, మా పిల్లలు… మరి మీ రంగనాయకిగారు రారా?” రంగనాయకి పేరు వినగానే గోవిందరాజుల గొంతు ఎండిపోయింది. “అది… మా వాళ్లు… ఆమెకు ఆరోగ్యం…” “అయ్యో, ఆమె తప్పక రావాలి. ఆమెనే మీ గురించి చాలా మంచిగా చెప్పింది. ‘మా గోవిందరాజులు గారికి వాహనాల సంగతి బాగా తెలుసు’ అంది. ఆమెను ముందే సీట్లో కూర్చోబెట్టాలి.” సుబ్బలక్ష్మి నవ్వు దాచుకుంది. సుమతి తలదించుకుని పట్టు అంచు సరిచేసుకుంటున్నట్టు చేసింది. గోవిందరాజులు చేతిలోని ఆల్బమ్‌లు కవర్‌లో పెట్టాడు. అతని కదలికల్లో ఇప్పుడిక చనువు లేదు; బయటపడకముందే వెనక్కి తగ్గే తొందర మాత్రమే ఉంది. “సరే… నేను ఇంటికి వెళ్లి చూసి చెబుతాను.” “ఎందుకు ఇంటికి వెళ్లాలి అన్నా? నీ బస్సులే కదా. రేటు చెప్పు. మనం అందరం share చేసుకుంటాం.” “లేదమ్మా, డ్రైవర్లు ఉన్నారా, బుకింగ్స్ ఉన్నాయా చూడాలి.” “ఫ్రీ అని ఇప్పుడే అన్నావు కదా,” సుబ్బలక్ష్మి అమాయకంగా అడిగింది. గోవిందరాజులు ఆమె వైపు చూసి బలవంతపు నవ్వు నవ్వాడు. “అదీ… వదినగారికి… అంటే… ఫ్యామిలీకి…” “అదే కదా అన్నా, మనమంతా ఫ్యామిలీ,” అంది ఉమాదేవి. ఆ ఒక్క మాట అతనికి మరింత ముళ్లుగా తగిలింది. తనకు కావలసిన ఏకాంతాన్ని ఆమె సామూహికంగా మార్చేసింది. తన చనువును ఆమె బంధుత్వంగా మార్చేసింది. తన ఆహ్వానాన్ని ఆమె లెక్కల బుకింగ్‌గా మార్చేసింది. “సరే, నేను మళ్లీ వస్తాను,” అని అతను తడబడుతూ తలుపువైపు కదిలాడు. “ఆల్బమ్‌లు మర్చిపోవద్దు అన్నా,” అంది ఉమాదేవి. అతను మళ్లీ తిరిగి వచ్చి ఆల్బమ్‌లు తీసుకున్నాడు. ఈసారి అతని చేతులు ఎక్కడా తాకలేదు. ఫైల్ పట్టుకున్నట్టే గట్టిగా పట్టుకున్నాడు. “వెళ్తాను,” అన్నాడు. “జాగ్రత్తగా వెళ్లండి అన్నా. సాయంత్రం లోపల చెప్పండి. గ్రూపులో మెసేజ్ పెట్టాలి కదా,” అంది ఉమాదేవి. గోవిందరాజులు ఈసారి ఏమీ అనలేదు. బయటికి వెళ్లిపోయాడు. తలుపు దాటిన తర్వాత అతని అడుగుల వేగం పెరిగింది. తలుపు మూసిన వెంటనే సుబ్బలక్ష్మి ఊపిరి విడిచింది. “వదినగారూ, మీరు అతన్ని బస్సులోనే కూర్చోబెట్టేసారు,” అంది. సుమతి నవ్వింది. “అతను ఊరు చూపిస్తానన్నాడు. మీరు అపార్ట్‌మెంట్ యాత్రగా మార్చేశారు.” ఉమాదేవి కూడా నవ్వింది. కానీ ఆ నవ్వులో కొంచెం అలసట ఉంది. “ఒంటరి ఆహ్వానం ప్రమాదం అయ్యే చోట, కుటుంబ ఆహ్వానం కవచం అవుతుంది,” అంది. సుబ్బలక్ష్మి ఆమెను కొత్తగా చూసింది. “వదినా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ?” ఉమాదేవి క్షణం ఆగింది. “నేర్చుకుంటున్నాను,” అంది. “ఇప్పుడే నేర్చుకుంటున్నాను.” ముగ్గురూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ మౌనం బరువుగా లేదు. కలిసి అర్థం చేసుకున్న స్త్రీల మధ్య ఏర్పడే ఒక రకమైన రక్షణ మౌనం. “కానీ నిజంగా ట్రిప్ పెడదామా?” సుమతి అడిగింది. “ఎందుకు కాదు?” ఉమాదేవి నవ్వింది. “అతను మన కోసం కాకపోయినా, మనం మన కోసం వెళ్దాం. ఒక్కరోజు బయటికి వెళ్లడం కూడా కొన్ని ఇళ్లలో స్త్రీలకు పండుగే కదా.” సుబ్బలక్ష్మి కళ్లలో ఆ మాట వినగానే వెలుగు వచ్చింది. “నిజంగా?” “నిజంగా. కానీ ఈసారి గోవిందరాజులు బస్సు పెడతారు. డబ్బులు మనం ఇస్తాం. లెక్క స్పష్టంగా ఉంటుంది. వాళ్లందరి భర్తలు కూడా వస్తారు. పిల్లలు కూడా వస్తారు. ఏకాంతం ఎవరికీ దొరకదు. ఆనందం అందరికీ దొరుకుతుంది.” సుమతి నవ్వుతూ అంది, “అదే సరైన శిక్ష.” “శిక్ష కాదు,” అంది ఉమాదేవి. “పాఠం.” సాయంత్రం రాజేశ్వరి ఆఫీసు నుంచి వచ్చాక ఈ విషయం విన్నది. మొదట ఆమె ముఖం గంభీరంగా మారింది. తర్వాత ఉమాదేవి గోవిందరాజుల మాటలను ఎలా తిప్పిందో విన్నప్పుడు ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. “అంటే అతను నీకు ఊరు చూపిస్తానన్నాడు. నువ్వు అతనికి అపార్ట్‌మెంట్ మొత్తం చూపించబోతున్నావా?” “అవును,” అంది ఉమాదేవి. “అతని ఉద్దేశం ఒంటరి ప్రయాణం. నా సమాధానం కుటుంబ యాత్ర.” హేమ వెంటనే ఫోన్ తీసుకుంది. “అమ్మా, గ్రూప్ మెసేజ్ నేను draft చేస్తాను. ‘సండే ఫ్యామిలీ డే అవుట్. గోవిందరాజులు గారి ట్రావెల్స్ స్పెషల్ ప్యాకేజ్’ అని పెడతా.” రమ నవ్వింది. “డిస్కౌంట్ అడగాలి. అతనే ఆఫర్ ఇచ్చాడు కదా.” రాజేశ్వరి మెల్లగా ఉమాదేవిని చూసింది. “కానీ నువ్వు బాగున్నావా?” ఉమాదేవి ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు. ఆమె చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. రికార్డింగ్ ఇంకా సేవ్ అయి ఉంది. “బాగున్నాను,” అంది చివరికి. “కానీ ఈరోజు ఇంకో విషయం అర్థమైంది.” “ఏమిటి?” “కొంతమంది మగవాళ్లు స్త్రీతో మాట్లాడరు రాజు. ఆమె చుట్టూ ఉన్న ఖాళీతో మాట్లాడతారు. ఇంట్లో ఎవరూ లేరా? భర్త దూరమా? పిల్లలు బయటా? అప్పుడు వాళ్ల ధైర్యం పెరుగుతుంది. ఆ ఖాళీని మనమే నింపుకోవాలి—మన మాటలతో, మన తెలివితో, మన వాళ్లతో.” రాజేశ్వరి నిశ్శబ్దంగా ఆమె పక్కన కూర్చుంది. “ఇక నుంచి నువ్వు ఒంటరిగా లేవు ఉమా,” అంది. “తెలుసు,” అంది ఉమాదేవి. “అందుకే భయం తగ్గుతోంది.” ఆ రాత్రి డైరీలో ఆమె ఇలా రాసింది: “ఇవాళ గోవిందరాజులు నాకు ఊరు చూపిస్తానన్నాడు. అతను చూపించాలనుకున్నది ఊరు కాదు; నేను ఒంటరిగా ఉన్నాననే తన ధైర్యం. నేను ఆ ఒంటరితనాన్ని కుటుంబాలతో నింపాను. స్త్రీకి రక్షణ ఎప్పుడూ గోడలలో ఉండదు. కొన్నిసార్లు ఒక మాటను ‘మనమందరం’గా మార్చగలిగే తెలివిలో ఉంటుంది.” ఆ వాక్యం రాసిన తర్వాత ఉమాదేవి పెన్ను మూసింది. అద్దం ఎదుట నిలబడినప్పుడు అద్దంలోని రూపం ఈసారి కొద్దిగా నవ్వినట్టనిపించింది. అది ఆమె నవ్వు కాదు. తల్లి నవ్వు కూడా కాదు. ఎందరో స్త్రీలు తమ తమ ఇళ్లలో నేర్చుకున్న చిన్న తెలివితేటలన్నీ కలిసి ఒక చీకటి గదిలో వెలిగిన దీపంలా కనిపించిన నవ్వు.
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (2)
Nice concept keep going
Thank you very much sister Sandhya...