చెన్నైలో అతను ఒక అపార్ట్‌మెంట్‌లో మరి ఇద్దరు బ్యాచిలర్లతో కలిసి ఉండటం మొదలుపెట్టాడు. మొదటి రోజుల్లో వాళ్లు సాధారణంగానే కనిపించారు. ఆఫీస్‌కు వెళ్లేవారు. సాయంత్రం నవ్వుతూ మాట్లాడేవారు. కానీ నాలుగైదు రోజుల్లోనే రమణ ఒక రహస్యం గమనించాడు.
రాత్రి గదులు మూసుకుంటే వాళ్లు మారిపోతారు.
ఒకరు లావణ్య. ఇంకొకరు దీపిక. పగటిపూట వాళ్లకు వేరే పేర్లు. రాత్రివేళ వాళ్లు స్త్రీ దుస్తుల్లో స్వేచ్ఛగా నవ్వుతారు. మొదట రమణ ఆశ్చర్యపోయాడు. కానీ వాళ్లు భయపడలేదు.
“అరె, నువ్వు కూడా మా లాంటివాడివేమో,” అని ఒకరు నవ్వుతూ అన్నారు.
“నేను అలా కాదు,” అన్నాడు రమణ వెంటనే.
“అలా కాకపోతే బ్యాగులో చీరలు ఎందుకు?” అని ఇంకొకరు చమత్కరించారు.
రమణ మొహం ఎర్రబడింది.
ఆ రాత్రి అతను వాళ్లతో చాలా సేపు మాట్లాడాడు. వాళ్లు తమను “క్లోసెట్ సీడీలు” అని చెప్పారు. కొందరికి అది అలవాటు. కొందరికి అది విశ్రాంతి. కొందరికి అది నటన. కొందరికి అది తమలోని మరో వైపు. వాళ్లు ఎవరికీ హాని చేయడం లేదు. తమదైన చిన్న ప్రపంచం చేసుకున్నారు.
“నువ్వు ఏం కావాలనుకుంటున్నావు?” అని లావణ్య అడిగింది.
రమణ సమాధానం చెప్పలేకపోయాడు.
“నాకు తెలియదు,” అన్నాడు.
“తెలియకపోవడం తప్పు కాదు,” అంది దీపిక. “కానీ భయంతో దాచుకుంటూ ఉండటం బాధ.”
ఆ రోజు నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ముగ్గురూ మారిపోతారు. రమణ కూడా క్రమంగా వారితో కలిశాడు. నెమ్మదిగా రమణి అనే పిలుపుకు అలవాటు పడ్డాడు.
మొదట గదిలో మాత్రమే. తర్వాత అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై. తర్వాత కారు ఎక్కి రాత్రి సినిమాలకు. ఒకసారి పార్క్. మరోసారి బజార్. మరికొన్ని వారాలకు పండుగలు.
చెన్నై నగరం పెద్దది. పెద్ద నగరాల్లో మనిషి ముఖం అంత సులభంగా గుర్తుండదు. ఆ అనామకత రమణకి ధైర్యమిచ్చింది.
ఆడదుస్తులు మొదట అతనికి సరదా.
తర్వాత విశ్రాంతి.
తర్వాత తన మీద తనే నవ్వుకునే హక్కు.
తర్వాత తన బాధను కొద్దిసేపు మర్చిపోయే మార్గం.
సంవత్సరంలో వాళ్లు ఎన్నో చోట్లకు వెళ్లారు. కేరళలో చమయవిళక్కు ఉత్సవం చూశారు. విల్లుపురంలోకూవగం పండుగకు వెళ్లారు. అక్కడ ఎన్నో రూపాలు, ఎన్నో కథలు, ఎందరివో బాధలు, ఎన్నో నవ్వులు చూశాడు రమణ.
కొంతమంది నిజంగా స్త్రీలుగా జీవించేవారు.
కొంతమంది వ్రతం కోసం అలంకరించుకున్నవారు.
కొంతమంది కళ కోసం.
కొంతమంది గాయం దాచుకోవడానికి.
కొంతమంది ప్రపంచం అంగీకరించకపోయినా తమను తాము అంగీకరించుకోవడానికి.
అక్కడ రమణకు ఒక విషయం అర్థమైంది—స్త్రీ దుస్తులు ఒకే అర్థం కలిగి ఉండవు. ఎవరు ధరిస్తున్నారు, ఎందుకు ధరిస్తున్నారు, ఏ స్వేచ్ఛతో ధరిస్తున్నారు—అదే ముఖ్యం.
సంవత్సరం గడిచేసరికి రమణ తనలో ఒక కొత్త మార్పు అనుభవించాడు. రమణ రమణి గా. అతను పూర్తిగా మారిపోయాడా? ఏమో. రమణి అతనికి అక్క ఐడియా కాదు. అది తనకు ఒక అద్దం.
ఇంతలో ఇంటి నుంచి వార్త వచ్చింది. ఇందిర నాయనమ్మ చనిపోయింది.
రమణ చెన్నై వదిలి తిరిగి రావాలని నిర్ణయించాడు. కాని తిరిగి రావడానికి ముందు అద్దం ముందు నిలబడ్డాడు. తన పురుష దుస్తులు చూసాడు. పక్కన రమణి దుస్తులు చూసాడు. చాలాసేపు ఆలోచించాడు.
“ఇంటి వాళ్లు నా మాటలు ఎప్పుడూ వినలేదు,” అనుకున్నాడు. “ఈసారి నేను వాళ్లను వినేలా చెయ్యాలి.”
అలా రమణగా వెళ్లిన వాడు, రమణిగా తిరిగి వచ్చాడు. (ఇంకా ఉంది)
Discussion (0)