మొదటి రోజు చుడీదార్ వేసుకున్నాడు. అద్దం ముందు నిలబడ్డాడు. నవ్వొచ్చింది. కానీ విచిత్రంగా అసహ్యం రాలేదు.
రెండో రోజు లాంగ్ ఫ్రాక్.
మూడో రోజు సల్వార్.
నాలుగో రోజు రాత్రి లంగా జాకెట్.
తన జుట్టు భుజాల వరకు పెరిగి ఉండేది. కాలేజీ ఫ్యాషన్ అని ఉంచుకున్నాడు. ఆ జుట్టు ఇప్పుడు వేషానికి సహజత్వం ఇచ్చింది. అతను మేకప్ ఎక్కువగా చేయలేదు. కొద్దిగా బొట్టు. కొద్దిగా కాజల్. ఒక చిన్న గొలుసు.
అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు.
“రతి,” అని ఒక్కసారి మెల్లగా పలికాడు.
ఆ పేరు ఎవరు పెట్టారు? ఎవరో కాదు. ఆ క్షణంలో అతని ఆసక్తే పెట్టింది.
అతను అర్ధరాత్రి వరకు రకరకాల సెల్ఫీలు దిగాడు. నవ్వుతూ. నిలబడి. కూర్చుని. తండ్రి ఫోటోలలోని కొన్ని భంగిమలు గుర్తు చేసుకుంటూ.
తర్వాత ఏం చేయాలో తెలియలేదు. అలసట వచ్చింది. అలాగే మంచం మీద పడి నిద్రపోయాడు.
తెల్లవారుజామున అయిదింటికి ఎవరో తలుపు తట్టారు.
“రతి… లేమ్మా…”
రతీష్ కళ్లుతెరిచాడు. మొదట ఎక్కడున్నాడో అర్థం కాలేదు. తర్వాత తన దుస్తులు గుర్తుకొచ్చాయి. లంగా జాకెట్. బొట్టు. గాజులు.
బయట నుంచి మృదువైన గొంతు మళ్లీ వినిపించింది.
“రతి, లేమ్మా. అత్తా వాళ్లు యుయస్ నుంచి వచ్చారే. కాఫీ పెట్టవే.”
అది తన తండ్రి గొంతు.
రతీష్ గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.
“నాన్న వచ్చేశాడా?”
అతను తడబడి లేచాడు. తలుపు దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. తండ్రి తలుపు అర్ధంగా తెరిచి చూసాడు. మహీధర్ కళ్లల్లో ఒక్క క్షణం ఆశ్చర్యం మెరిసింది. కానీ వెంటనే అతని ముఖం సాధారణంగా మారిపోయింది.
“బ్రష్ చేసుకుని రా తల్లీ,” అన్నాడు. “అత్తా వాళ్లు వచ్చారు. చాలా అలసిపోయారు.”
రతీష్‌కు ఏం అర్థం కాలేదు. “తల్లీ” అన్న మాటలో దండన లేదు. ఆటపట్టించడం లేదు. ఆజ్ఞ లేదు. ఒక విచిత్రమైన మృదుత్వం ఉంది.
అతను అద్దం ముందు నిలబడి తనను చూసుకున్నాడు. జుట్టు భుజాల వరకూ ఉంది. ముఖం మృదువుగా ఉంది. ఆ ఉదయం చూసేవారికి అనుమానం వచ్చేదా? తెలియదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరగడానికి మార్గం లేదు.
రతీష్ బ్రష్ చేసుకున్నాడు. ముఖం కడుక్కున్నాడు. లంగా జాకెట్ సరిచేసుకున్నాడు. తలుపు తెరిచి బయటకు వచ్చాడు.
ఆ క్షణం నుంచి రతీష్ కాదు—రతి రంగంలోకి దిగింది.
హాల్లో అమెరికా నుంచి వచ్చిన గీత అత్త, ఆమె భర్త, కొడుకు సంతోష్ కూర్చున్నారు. గీత అన్నని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. రతిని చూసి మాత్రం ముచ్చటపడి నిలబడ్డట్టే అయింది. (ఇంకా ఉంది)
Discussion (2)
Very cute story akka
థాంక్స్ చెల్లి మీకు