Family · Telugu

సంపెంగ తీగ - పాముల పాగా

సంపెంగ తీగ - పాముల పాగా Cover Image
Completed | Part 2 of 3 | 0 Likes

Part 2

Part 2 Image

అత్త బతికున్నంతకాలం నాకు ప్రపంచం అంత భయంకరంగా అనిపించలేదు. ఆమె నీడలో నేను పెరిగాను. యౌవనంలోకి వచ్చాను. నా శరీరం మారినా, నా మనసు అప్పటికే తన దారిని ఎంచుకుంది. ఆ దారికి మొదటి దీపం వెలిగించింది నా అత్తే.
కానీ ఆ నీడ ఎక్కువకాలం నిలవలేదు.
నా యౌవనం మొదలయ్యే సరికి అత్త చనిపోయింది.
ఆ రోజు నా రెండో పుట్టుక కూడా అయింది. ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే తల్లి కావాల్సి వచ్చింది. నాకు నేనే అక్క కావాల్సి వచ్చింది. నాకు నేనే రక్షణ కావాల్సి వచ్చింది.
అత్త చనిపోయిన తర్వాత ఊరి చూపు మారిపోయింది. ఇంతవరకు అత్త నీడలో దూరంగా నిలిచిన మాటలు దగ్గరకు వచ్చాయి. నన్ను పిలిచే పేర్లు మారాయి. కొందరు “సంపంగి” అన్నారు. కొందరు “ఆడంగి” అన్నారు. కొందరు నవ్వారు. కొందరు కనికరించారు. మరికొందరు కనికరం పేరుతో దగ్గరయ్యారు.
అప్పుడే నాకు తెలిసింది — ప్రపంచంలో కొందరు పూలను పరిమళం కోసం చూస్తారు. కొందరు పూలను కోయడానికి చూస్తారు. ఇంకొందరు పూల మీద పాముల్లా పాకుతారు.
నేను ఒక సంపెంగ తీగనయ్యాను.
నన్ను చుట్టుకుని ఎన్నో నాగుల పాగాలు వచ్చాయి. చిన్ననాట నా చుట్టూ తిరిగినవాళ్లు బురదగొడ్డుల్లా కనిపించారు. వయసు వచ్చిన తర్వాత కోడె నాగుల్లా వచ్చారు. నా మృదుత్వాన్ని ప్రేమగా కాదు, బలహీనతగా చూశారు.
పెద్ద త్రాచుల్లాంటి వారు వచ్చారు. తీపి మాటలతో మొదలుపెట్టారు. చివరికి తీగంతా మింగేయాలని చూశారు. అనకొండల్లాంటి బలాలు వచ్చాయి. వారి చేతుల్లో మాటలూ కాదు, మౌనాలూ కాదు — ఒక సంపూర్ణ మింగుడు ఉండేది.
బాట పక్కన బండల మాటున కొండచిలువలు దాక్కునేవి. అవకాశం దొరికితే చుట్టుకునేవి. పట్టు వదలని బలంతో చుట్టుముట్టేవి. బయటికి వాళ్లు పెద్దమనుషులు. లోపల వాళ్ల చూపు మృగదృష్టి.
కొన్ని పాములు కాటేసేవి. ఆ కాటు శరీరానికి కాదు — మనసుకు. కొన్ని సత్తులేక బుసకొట్టేవి. భయపెట్టడమే వారి బలం. కొన్ని పువ్వులోనే విషం జార్చేవి. నమ్మకం మీద విషం చిమ్మేవి. కొన్ని ఎప్పటికీ లేవలేని నీచత్వంతో నేలమీదనే పాకేవి.
నా జీవితంలో రెండు తలల పాములూ వచ్చాయి. ఒక ముఖంతో ముద్దు మాటలు. మరో ముఖంతో ద్రోహం. పైకి రక్షకులు. లోపల రాక్షసులు. నా గాయాలు బయట కనిపించలేదు. లోపల నక్కి దాగాయి.
ఎన్ని సార్లు ఎదిరించానో తెలియదు. ఎన్ని సార్లు పారిపోయానో తెలియదు. ఎన్ని సార్లు కూలిపోయి లేచానో తెలియదు. కొన్నిసార్లు తిట్టాను. కొన్నిసార్లు ఏడ్చాను. కొన్నిసార్లు మౌనంగా నిలబడ్డాను. కొన్నిసార్లు బలం ముందు కృంగిపోయాను.
అది నా ఓటమి కాదు. అది నా కాలం. నా ఒంటరితనం. నా రక్షణలేమి.
ఎనభై ఏళ్లలో ఎన్నింటినో చూశాను. నీతిలేని పాములను తిట్టిపోశాను. నీటిపాములు వచ్చి మెట్ట మీదే గిట్టిపోయాయి. బలమున్న పాములకు కొన్నిసార్లు లొంగి కృంగిపోయాను. అయినా నేను పూర్తిగా విరగలేదు.
ఎందుకంటే నా లోపల అత్త మాట నిలిచింది.
“నీ తప్పేం లేదు,” అన్న ఆ మాట నా ప్రాణం కాపాడింది.
సమాజం నన్ను ఎన్నో పేర్లతో పిలిచింది. కొందరు హాస్యంగా చూశారు. కొందరు ఆశగా చూశారు. కొందరు దయగా చూశారు. కొందరు దురాశగా చూశారు. కానీ నన్ను నిజంగా చూసినవాళ్లు చాలా కొద్దిమంది. వాళ్లలో మొదటిది నా అత్త.
నాకు ఇప్పుడు వయసు ఎనభై. చేతులు వణుకుతాయి. అడుగులు నెమ్మదించాయి. కానీ నా లోపల ఇంకా ఒక సంపెంగ పువ్వు ఉంది. కాలం ఎంతైనా దాని గంధం మారలేదు.
నన్ను మింగాలని వచ్చిన పాములు ఎన్నో. నా చుట్టూ చుట్టుకున్న నాగుల పాగాలు ఎన్నో. కానీ తీగ ఎండిపోలేదు. పువ్వు సువాసన కోల్పోలేదు.
ఇప్పుడు వెనక్కి చూసుకుంటే, నా జీవితం ఒకే మాట చెబుతోంది.
ఒక ఆడంగి పిల్లను ప్రపంచం తొలుత నవ్వుతుంది. తర్వాత వెతుకుతుంది. తర్వాత వినియోగించుకోవాలని చూస్తుంది. చివరికి ఆమె నిలబడి ఉంటే ఆశ్చర్యపడుతుంది.
నేను నిలబడ్డాను.
అత్త ఇచ్చిన పేరుతో మొదలైన నా జీవితం సంపంగి. కాలం నన్ను సంపెంగగా మార్చింది. సంపంగి ఏడ్చింది. సంపెంగ చూశింది. సంపంగి ఆశ్రయం అడిగింది. సంపెంగ సాక్ష్యం చెబుతోంది.
నేను ఒక సంపెంగ తీగ.
వచ్చెపోయె నాగుల పాగ.
ఒకటే సంపెంగ పువ్వు.
కాలమెంతైనా ఒకటే గంధం.

174 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login