Family · Telugu

సంపెంగ తీగ - పాముల పాగా

సంపెంగ తీగ - పాముల పాగా Cover Image
Completed | Part 1 of 3 | 0 Likes

Part 1

Part 1 Image

సంపెంగ తీగ - పాముల పాగా
(సంపంగి ఆత్మకథ)
రచన - జి వి గరిమ

నా అసలు పేరు సంపత్. కానీ ఆ పేరు నాకు ఎప్పుడూ నా పేరుగా అనిపించలేదు. ఆ పేరులో నా శ్వాస లేదు. నా నవ్వు లేదు. నా అడుగు లేదు. నా మనసు లేదు.
చిన్నప్పటి నుంచే నాకు అక్కల గౌన్లు, లంగాలు, గాజులు, పూలు, బొట్లు చాలా దగ్గరగా అనిపించేవి. అక్కలు చెమ్మచెక్క ఆడుతుంటే వాళ్ళ మధ్య కూర్చోవాలని అనిపించేది. అమ్మ వంటింట్లో తిరుగుతుంటే ఆ పొగలో, ఆ పసుపు వాసనలో, ఆ పనుల నడుమ నేనూ తిరగాలని అనిపించేది.
అమ్మ నన్ను అర్థం చేసుకుంది. కానీ నాన్న కంట పడకుండా దాచింది.
“ఇలా ఉండొద్దే. నీ నాన్న చూస్తే కోప్పడతాడు,” అనేది. ఆ మాటలో కోపం ఉండేది కాదు. భయం ఉండేది. నన్ను కాపాడాలనే ఆరాటం ఉండేది.
అన్నా, తమ్ముడు మాత్రం నన్ను చూసి నవ్వుతూ దూరం జరిగేవారు. వాళ్లకు నేను ఆటపాటల విషయం. కానీ అక్కలు మాత్రం నన్ను వెక్కిరించలేదు. వాళ్ళు చెమ్మచెక్కకు పిలిచేవారు. పూలు పెట్టేవారు. గాజులు తొడిగేవారు. నా నవ్వు వాళ్ల మధ్యే పుట్టేది.
ఊరిలోని నళిని, వనజ, సరళ, రోజా — వాళ్ళంతా నాకు స్నేహితులే. కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటుంటే నళిని నవ్వుతూ నా నడుము గిల్లేది. వనజ కూరలు ఇస్తూ వంకరగా నవ్వేది. సరళ దువ్వెన ఇస్తూ “జడ వేసుకో” అనేది. రోజా రోలు చూపిస్తూ “రా, దంచు చూద్దాం” అనేది. వాళ్ళ మాటల్లో కొంచెం ఆట ఉండేది. కానీ ద్వేషం ఉండేది కాదు. వాళ్ళ మధ్య నాకు సిగ్గు ఉండేది. కానీ భయం ఉండేది కాదు.
మగవాళ్లు దగ్గరకు వస్తే మాత్రం గుండె జలదరించేది. వాళ్ళ చూపు వేరుగా ఉండేది. వాళ్ళ నవ్వులో ఒక గుచ్చు ఉండేది. నేను నిక్కరు కట్టుకుంటే “లంగా కట్టరా?” అంటారు. లంగా కట్టుకుంటే “నిక్కరు కట్టవా?” అంటారు. వాళ్ళకు నేను నవ్వుల విషయం. నాకు నేను మాత్రం ఒక ప్రశ్న. బావ "ఒసేవ్ ఈ పూలు పెట్టుకుని రా." అని పూలిచ్చేవాడు. నేను బజారు నుంచి పాల పాకెట్ తెస్తా ఉంటే పక్కింటి పార్థు "ఆ పాలు నీవేనేంటే?" అని అడిగేవాడు. "నేను పెరగాలనుకునేది, తిరగాలనుకునేది ఆడపిల్లలా. పుట్టింది మాత్రం ఏదోలా?" నా బాల్యం, కౌమారం ఇలాగే గడిచాయి. నాన్న తిట్టినప్పుడల్లా అత్త దగ్గరకు పొయ్యే దాన్ని. ఒకసారి ఈ వేధింపులు తాళలేక ఒకసారి
“ఏమి సెయ్యాలే అత్తా?” అని ఏడుస్తూ నేను మా అత్తింటికి వెళ్లిన రోజు నా జీవితంలో మొదటి మలుపు.
నాన్న కోపంతో ఇంటి నుంచి నన్ను గెంటేశాడు. అమ్మ ఏడ్చింది. కానీ నన్ను ఆపలేకపోయింది. నా కాళ్లు దారి తెలియకుండా నడిచాయి. చివరికి అత్త ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోయాయి.
అత్త నన్ను చూసి ఒక్క మాట అడగలేదు. ముందుగా ఒడిలోకి తీసుకుంది. నేను అంతా చెప్పాను. అమ్మ భయం. నాన్న కోపం. అన్నదమ్ముల నవ్వులు. ఊరి చూపులు. నా సిగ్గు. నా కోరిక. నా గందరగోళం. అన్నీ చెప్పాను.
అత్త నా తల నిమిరింది.
“అలా ఏడవ మాకే ఆడంగి. నీ తప్పేం లేదే మంగి. నా తమ్ముడు భయంతో నిన్ను గెంటేశాడే సంపంగి. ఆడంగి కూడా ఆడపిల్లే అని వాడికి తెలీదు శివంగి,” అంది.
ఆ మాట వినగానే నా లోపల ఏదో తలుపు తెరుచుకుంది. జీవితంలో మొదటిసారి ఎవరో నన్ను తప్పు అనలేదు.
అత్త నన్ను తన దగ్గరే ఉంచుకుంది. “నిన్ను నేను పెంచుకుంటా. నాతోపాటు ఉంచుకుంటా. లంగా ఓణీలు కొనిపెడతా. నీ మంచీ చెడ్డా నేనే చూస్తా,” అంది.
ఆమె కొన్న మొదటి లంగా ఓణీ వేసుకుని అద్దం ముందు నిలబడిన రోజు, నా కళ్లలో నేను మొదటిసారి కనిపించాను. నేను సంపత్ కాదు. నేను సంపంగి.
అత్త నాకు కేవలం ఆశ్రయం ఇవ్వలేదు. జీవితం ఇచ్చింది. పూలు కట్టడం నేర్పింది. వంట నేర్పింది. చీర మడతలు సరిచేయడం నేర్పింది. పనిలో శ్రద్ధ, మాటలో మృదుత్వం, నవ్వులో మౌనం, ఏడుపులో గౌరవం నేర్పింది.
“నిన్ను నువ్వు ద్వేషించకు. నీకు తగిన స్థలం ప్రపంచంలో ఎక్కడో ఉంటుంది,” అనేది.
నన్నొక గాయకురాలిగా, జానపద నాట్య కత్తెగా నిలబెట్టింది. నాటు వైద్యపద్ధతుల్లో నన్ను పడతిని చేయించింది. ఆరోజు నా ఊపిరినిండా గర్వం. నా ఎదలో గర్వం. అద్దం ముందు నిలబడి అన్ని అలంకారాలతో ఉన్న నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అణువణువులో నేనాడపిల్లనే అని గర్వం.

201 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login