ఆడమనసు
కాలి మువ్వల సవ్వడి లయబద్ధంగా వినబడుతోంది. చేతి మట్టి గాజుల గలగలలు చెవులకు హాయిని కలిగిస్తున్నాయి.
"అమ్మా, ... అమ్మా" ... అని ప్రేమగా పిలుపు.
పూజగదిలో దిగాలుగా కూర్చుని ఉన్న జానకమ్మ అటు చూసింది.
చేతిలో పూలసజ్జ.. పట్టు పావడా ఒకచేత్తో కొద్దిగా పాదాలవరకూ పైకెత్తి మువ్వల సవ్వడి చేస్తూ అమ్మను చేరి ఎదురుగా నిలబడి "అమ్మా... నేనమ్మా, సుమను. వ్రతం చేసుకుందాం. రామ్మా." అని మధురమైన గొంతుతో పలకరింపు.
ఎదురుగా అపురూపమైన మోహినీ రూపం. తామరపువ్వులవంటి అందమైన ఎర్రని పాదాలు. పాదాలకు అందాన్ని పెంచే సన్నని మువ్వల పట్టీలు.
చిలకాకుపచ్చ పట్టు పావడా. అందమైన నడుముకు అందాన్ని జోడిస్తున్న లోతైన బొడ్డు. బొడ్డును కప్పీ కప్పలేక పైనుంచి క్రిందకు సెలయేటి పాయలా జాలువారుతూ నడుముదగ్గర మలుపు తీసుకుని వెనుక వైపు పిరుదులను కప్పుతూ తిరిగి ముందుకు వచ్చి నడుము వద్ద పావడా కి, నడుముకి మధ్య ఇరుక్కుపోయిన
గులాబీ రంగు ఓణీ.
ఆ పైన చక్కని ఎద సంపద. మెడలో చక్కని బంగారు గొలుసు.
తీరైన గుండ్రని ముఖం లో
తీర్చి దిద్దిన బొట్టు, కాటుక. కాముని ధనువులా ఒంపుతిరిగిన కనుబొమలు. భుజాల వరకు వచ్చి నిల్చిన, ఒత్తైన కేశ రాశి.
జానకమ్మ కన్నుల్లో వర్షాకాలపు నీలిమేఘాల కడుపులోంచి పుడుతున్న మెరుపుల జిలుగులు.
జానకమ్మ ఆనందం తో, "తల్లీ, సురేఖ!"... అంది. కాదమ్మా, నేను.. సుమను." అంది.
జానకమ్మ కన్నుల్లో ఆనందబాష్పాలు. ఒక్క సారి అలాగే గతంలోకి వెళ్ళింది.
***********************
జానకమ్మ సంప్రదాయ భారతీయ మహిళ. ఆమెకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణం. ఇంటి క్షేమం కోసం ఆమె చేయని వ్రతాలు, పట్టని నోములు లేవు. ఆమె భర్త రఘురామ్ వ్యాపారవేత్త. ఎక్కువ కాలం విదేశీ పర్యటనలలోనే గడిపేవాడు. ఇంటి బాధ్యతలన్నీ జానకమ్మ భుజాలమీదే ఉండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు — కూతురు సురేఖ, కొడుకు సుమంత్.
సురేఖ చిన్నప్పటి నుంచే తల్లి వెంట వ్రతాలు, నోములు, పూజలు చేసేది. ప్రతి శ్రావణం, ప్రతి శుక్రవారం, ప్రతి పండుగ ఇంటిని ఒక పవిత్రమైన ఆడబిడ్డల లోకంలా మార్చేసేవి. ఆ పూజల సమయంలో సుమంత్ కూడా అక్క పక్కనే కూర్చునేవాడు. సురేఖ చేతికి తోరణం కట్టించుకుంటే తానూ కట్టించుకునేవాడు. ఆమె కాళ్ళకు పసుపు, పారాణి పూస్తే తనకూ పూయించుకునేవాడు. కళ్ళకు కాటుక పెట్టించుకునేవాడు. సురేఖ తమ్ముణ్ణి ప్రేమగా “సుమ” అని పిలిచేది.
సురేఖకు తమ్ముడంటే ప్రాణం. బయటికి వెళ్తే అతనికోసం దుస్తులు కొనకుండా రాదు. మగదుస్తులతో పాటు చిన్న చిన్న గౌన్లు, పరికిణీలు, జాకెట్లు కూడా తెచ్చి వేసేది. వాటిని సుమంత్ కూడా ఎంతో సహజంగా ధరించేవాడు. అందులో అతనికి విచిత్రం అనిపించేది కాదు. అది ఇంట్లో ప్రేమతో నిండిన ఒక ఆటలా, ఒక అనుబంధంలా ఉండేది.
కాలం గడిచింది. సురేఖ పెళ్ళై అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడే స్థిరపడిపోయింది.
ఇంట్లో ఒక్కసారిగా ఒక వెలితి ఏర్పడింది. నోముల రోజులు వచ్చేవి. పూజాసామాను సిద్ధమయ్యేది. కానీ సురేఖ నవ్వు వినబడేది కాదు. జానకమ్మ ఆ లోటును మౌనంగా మోస్తోంది. బయటకు కనిపించకపోయినా ఆమె మనసు క్రమంగా దిగులులో మునిగిపోతోంది.
సుమంత్ అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి మనసులోని ఆ వెలితిని అతను నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు.
ఆరోజు శుక్రవారం. పూజాసామాను అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ జానకమ్మలో ఉత్సాహం లేదు. సురేఖ జ్ఞాపకం ఆమెను లోపల లోపల కలచేస్తోంది.
కొద్దిసేపటి తరువాత గదిలోంచి మెల్లగా బయటికి వచ్చాడు సుమంత్. ఏదో నిశ్చయం.
ఇప్పుడు తను సుమ.
అక్క గదిలోకి వెళ్ళి
సురేఖ పాత పట్టు పావడా -ఓణీ ధరించింది. చేతులకు గాజులు. కాళ్ళకు వెండి మువ్వల పట్టీలు, పసుపు, పారాణి. కళ్ళకు కాటుక. జుట్టును కూడా సురేఖలా సర్దుకుంది.
“అమ్మా… నేను సుమను వచ్చాను. నోము మొదలు పెడదాం…” అన్న పిలుపుతో జానకమ్మ స్పృహ లోకి వచ్చింది.
**********************"
జానకమ్మ ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది. కానీ అది ఆమెకు పూర్తిగా కొత్త దృశ్యం కాదు. చిన్నప్పటి నుంచే సుమంత్ అక్కతో పాటు అలా ఉండటం చూసింది. కానీ ఈరోజు అతను కేవలం ఆటగా కాదు — తన బాధను పంచుకునేందుకు, తన ఒంటరితనాన్ని తగ్గించేందుకు తన ముందుకొచ్చాడనే భావన ఆమెను లోపల కరిగించింది.
ఆమె కళ్ళల్లో నీళ్ళు మెరిశాయి. వెంటనే బీరువా తెరిచి ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన బంగారు గాజులు, నెక్లెస్, పాపిడిపిందెలు తీసుకొచ్చింది. తన చేతులతో సుమను అలంకరించింది. ఆ రోజు ఎంతోకాలం తరువాత జానకమ్మ ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది. పూజ మళ్ళీ పండుగలా మారింది.
రోజూ ఏదో ఒక నోము... పూజ...
సుమగొంతు పదహారేళ్ళ కన్నెపిల్ల గొంతు. పైగా సంగీతం కూడా నేర్చుకున్నగొంతు.
నెమ్మదిగా అమ్మ దగ్గర స్త్రీ ల నోముల పాటలన్నీ నేర్చుకుంది.
కొద్ది నెలల తరువాత రఘురామ్ విదేశాలనుంచి ఇంటికి వచ్చాడు. ఆ రోజు శ్రావణ మాసంలో శుక్రవారం. జానకమ్మ సుమ చేత కన్నె గౌరీ నోము పట్టిస్తోంది. అది చూసి అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు.
పూజ అయిపోయిన తరువాత జానకమ్మను పక్కకు పిలిచాడు.
“ఇది ఏమిటి జానకి?” అని మెల్లగా అడిగాడు.
జానకమ్మ నేరుగా అతని కళ్ళల్లో చూసింది.
“నాకు ఇకపై సుమే కావాలి,” అంది.
రఘురామ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత సుమంత్ ను పిలిచాడు.
“నీ మనసులో ఏముంది?” అని అడిగాడు.
సుమంత్ ప్రశాంతంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను నాన్నా… అమ్మ మనసు చాలా సున్నితమైనది. సురేఖ అక్క వెళ్ళిన తరువాత అమ్మలో ఒక వెలితి ఏర్పడింది. ఆవెలితిని ఎలా తొలగించాలా అని ఆలోచించిన నాకు ఇలా తోచింది. అంటూ తన కన్నెపిల్ల ఆకృతిని చూపించాడు. చెప్పటం కొనసాగించాడు.
నాకు నా భవిష్యత్తు గురించి భయం లేదు. అలాగే స్త్రీ, పురుష దుస్తుల గురించి కూడా నాకు వివక్ష లేదు. నేను పురుషదుస్తులు ఎలా ధరిస్తానో, స్త్రీ దుస్తులూ అలాగే ధరిస్తాను.
కానీ చిన్నప్పటి నుంచీ ఈ వ్రతాలు, నోములు చూస్తూ పెరిగాను. అందుకే స్త్రీల దుస్తులంటే నాకు ఒక పవిత్ర భావన ఉంది. వాటిని గౌరవంతో ధరిస్తాను.
అమ్మ దుఃఖించకూడదు. అదే నేను కోరుకునేది.” అన్నాడు.
రఘురామ్ నిశ్శబ్దంగా విన్నాడు.
ఆ తరువాత జానకమ్మ ను పిలిచి సుమంత్ మాటలన్నీ వివరంగా చెప్పాడు. జానకమ్మ ఆనందంతో కళ్ళు మెరిశాయి. ఎద ఉప్పొంగిపోయింది.
“నా చిన్నకూతురు బంగారం…” అంది.
రఘురామ్ ఇద్దర్నీ దగ్గర కూర్చోబెట్టాడు.
“మీ తల్లీకూతుళ్ళు ఇకపై ఏమేం చెయ్యాలనుకుంటే అలాగే చెయ్యండి. బంధుమిత్రుల విషయం నేను చూసుకుంటాను,” అన్నాడు.
ఆ రోజు శ్రావణ శుక్రవారం.
సాయంత్రం జానకమ్మ, సుమ ఇద్దరూ చీరలు కట్టుకుని పేరంటానికి బయల్దేరారు.
వీధి చివరికి నడుస్తూ వెళ్తున్న వారిని చూసినవారికి వారు తల్లీకూతుళ్ళుగానే కనిపించారు.