కూతురు ఇచ్చిన ధైర్యం

gvgarima

  | November 19, 2025


Completed |   3 | 1 |   1077

Part 1

నా పేరు మోహన్. నావయస్సు 38 ఏళ్ళు. నేను విశాఖపట్నం గాజువాక లో ఒక డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నేను ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ లో ఒక సెమినార్ కు వెళ్ళినప్పుడు మహిళలు పాడిన సినీగీతాలలో సాహిత్యపు విలువలు గురించి నా పరిశోధన పత్రాన్ని సమర్పించాను. అందులో భానుమతి రామకృష్ణ గారి పాటలంటే నాకెంతో ఇష్టం. అచ్చం ఆవిడలాగే నేను ఆవిడ పాడిన పాటలను చాలా వరకు పాడగలను. అందుకని నా ఉపన్యాసాన్ని అందరూ ఇష్టపడ్డారు. అంతా మన మంచికే సినిమా లో ఆవిడ పాడిన "నేనె రాధనోయి గోపాలా" అనే పాటతో నా ఉపన్యాసాన్ని మొదలు పెట్టాను. ఆ రోజు నిర్వాహకుల అనుమతితో భానుమతి గారి లాగా వేషం వేసుకుని వచ్చాను. నాపేరు మోహన అని అనౌన్స్ చేశారు. ఆ ఉపన్యాసం లో వారు విక్రయంలో "పలుకవేమి నా దైవమా", ధర్మపత్ని సినిమాలో "నిలు నిలుమా నీలవర్ణ", స్వర్గసీమ సినిమాలో "ఓహొహో పావురం", లైలా మజ్ను లో "ప్రేమే నేరమౌనా", అనురాగం సినిమా లో "సన్నజాజి తీవెలోయ్ సంపెంగ పూవులోయ్", అంతస్తులు సినిమాలో "దులపర బుల్లోడా".... ఇలా చాలా పాటలు ఆవిడలాగా అభినయిస్తూ పాడుతూ ఆ పాటల్లో ఉన్న సాహిత్యపు విలువలు గురించి వివరించాను. ఆ సెమినార్ లో సుజాత అని ఒక ఇరవై ఒక్క ఏళ్లమ్మాయి తెలుగు డిపార్ట్మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ "ప్రబంధాలలో స్త్రీ గౌరవం" గురించి ప్రసంగించింది. ఆమె పద్యాలు చదివిన తీరు చాలా మధురం గా, హృద్యంగా ఉంది.
సెమినార్ చివర్లో నేను ఆమె వైపు కదిలాను. ఆమె నావైపు వచ్చింది. "అమ్మా, నమస్కారం." అంది. ఆమె నిండైన చీరకట్టు , కుచ్చిళ్ళు పేర్చుకున్నతీరు, ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉంది. పలకరింపు ఆత్మీయంగా ఉంది. "సుజాత గారూ మీ ప్రసంగం చాలా బాగుంది." అన్నాను. "అమ్మా నన్ను గారు అనకండి. సుజాత అనండి చాలు." అంది. మాటల్లో నేను నా పేరు మోహన్ అని ఈ సందర్భంగా కావాలనే మోహనగా చెప్పించానని చెప్పాను. ఆమె కళ్ళు పెద్దవి చేసి మీరు మగవారని చెబుతే కానీ నాకు తెలియలేదు. మీరు అచ్చం భానుమతమ్మ లాగానే ఉన్నారు. అని చెప్పింది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతున్నానని చెప్పింది. మరునాడు మా కాలేజీకి రమ్మని చెప్పాను. ఆమెను ప్రిన్సిపాల్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి కాలేజీ లో ఆమెను కూడా తెలుగు లెక్చరర్ గా అవకాశం ఇమ్మని అడిగాను. ప్రిన్సిపాల్ గారు నామాట పై ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.
అమె పట్టలేని ఆనందం తో నమస్కరించి "మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను వయసు లో మీరు పెద్ద వారు. సార్ అనటం ఇష్టం లేదు. ..." అని ఆగింది. "సందేహం ఎందుకు? అమ్మా అనే పిలు. నాకు అలా పిలిస్తే చాలా ఇష్టం." అన్నాను. (సశేషం)

Part 2

ఆరునెలలు గడిచాయి. సుజాత మాఇంట్లో ఒక కూతురు అయిపోయింది. అందరిలో నన్ను బాబాయి గారు అంటుంది. మేమిద్దరమే ఉన్నప్పుడు "అమ్మా" అని పిలుస్తుంది. మా ఆవిడకి నేనంటే ఎంతో ఇష్టం. నన్ను ఆమె ఎంతగానో గౌరవిస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఒప్పుకోదు. నేను ఇంట్లో ఉన్నంతవరకూ పూర్తిగా ఆడదానిగా ఉంటానంటే ఒప్పుకోదు. బయట నాటకాల్లో, సెమినార్ లలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ వేషం వేసుకుంటున్నారుకదా. అక్కడితో ఆగితే బాగుంటుంది. పిల్లలిద్దరూ ఇప్పుడిప్పుడే స్కూల్ చదువులకు వస్తున్నారు. అలాగే మా చుట్టాలు కానీ, మా చుట్టాలు కానీ వచ్చి చూస్తే ఇంటి పరువు ఏమౌతుంది? అని చెబుతుంది.
అయితే సుజాత నన్ను బాబాయ్ అని, అమ్మా అని పిలవటం తనకు తెలుసు. "ఆయన నీకు అమ్మ అయితే నేను ఏమౌతానే సుజాతా?!?" అనిఅడిగేది. "ఏముందీ? ఆయన బాబాయ్ అయితే మీరు నాకు అమ్మ అవుతారు. ఆయన అమ్మ అయితే మీరు నాకు అత్తయ్య అవుతారు." అనేది. "బాగుంది మీ తల్లీకూతుళ్లవరస." అంటూ సుజాత వీపు మీద సున్నితం గా ఒక చరుపు చరిచేది.
మా ఆవిడకి ఇష్టం లేకపోతే నేనే పనీ చెయ్యను. అయితే నేను ఇంట్లో ఒక మహిళ గా మసలటం నాకు ఎంతో ఇష్టం. ఒకసారి నా భార్య కి ఏదో తెలియని అనారోగ్యం చేసింది. పదిహేను రోజులపాటు హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అప్పుడు ఇంటిదగ్గర నేను చీర కట్టుకుని వంట చేసి, ఇంటి పనులన్నీ చేస్తుంటే ఆసుపత్రిలో ఆవిడ అవసరాలన్నీ సుజాత చూసేది.మధ్య మధ్యలో ఇంటికి వచ్చినప్పుడు చీరకట్టులో ఎన్నో మెళకువలు నాకు నేర్పింది.
ఒకసారి నేనూ, సుజాత మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పింది. "అమ్మా, అమ్మత్త (నా భార్య) భయం సమాజం గురించి. నీలో స్త్రీ గా ఉండాలనే తలంపు అది ఏ కారణం లేని ఒక సహజమానసిక స్థితి. బుద్ధి నిశ్చయం. ముందుగా నువ్వు చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇంట్లో నువ్వు సెమినార్ లలో స్త్రీ వేషంలో ప్రసంగించిన ఫోటోలు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో ఇంట్లో అన్ని చోట్లా పెట్టాలి. (సశేషం)

Part 3

అలాగే నువ్వు భానుమతమ్మలాగా, సావిత్రమ్మ లాగా, వాణిశ్రీ లాగా వేషం వేసుకుని నృత్యం చేసిన చిత్రాలు కూడా ఇంట్లో గోడలపైన పెట్టు... అలాగే ఆల్బమ్స్ కూడా పెట్టు. వాటిని చెల్లి తమ్ముడు ఇద్దరికి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా నువ్వు ఎప్పుడెప్పుడు ఆవేషాలు వేశావో
పరిచయం చేస్తూ ఉండు.
అప్పుడు చెల్లికి, తమ్ముడికి నువ్వు స్త్రీ గా దుస్తులను ధరించినా అదేదో ఒక రిహార్సల్స్ అనుకుంటారు. రేపెప్పుడైనా ఇంటికి తాతయ్య లు, అమ్మమ్మలూ, మావయ్యలు, బాబయ్యలూ వచ్చినా ఆ ఆల్బమ్స్ చూసి అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకుంటారు. నిలకడమీద నిజం తెలుసుకుంటారు.
అలాగే నువ్వు ఒక పని ధైర్యంగా చెయ్యాలి. మనకు తెలుసు. బళ్ళారి రాఘవ గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు వారు ఆడవేషాలలో ఆకాలంలో పేరంటాలకు వెళ్ళి ఎవ్వరికీ అనుమానం రాని విధంగా వాయినాలు తెచ్చుకున్నారట. అలాగే ఇది శ్రావణ మాసం కనుక నువ్వు కూడా అమ్మత్త రాజి ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళి నేను రాజి వదినను అని చెప్పు. నాలుగైదు మంగళ హారతి పాటలు నేర్చుకుని వెళ్ళు.
నువ్వు ఆడదానిగా గౌరవం పొందాలంటే స్త్రీలలో నీకు సామాజికమైన గుర్తింపు సంపాదించుకోవాలి. అందరూ నిన్ను స్త్రీగా గుర్తించాలంటే స్త్రీల సాహచర్యం అతి సహజంగా, ఏ కామవాంఛ లేకుండా పొందాలి. దీనికి ఎంతో ధైర్యం అవసరం నీకు.
ఈలోగా వీలు చూసుకుని అమ్మత్తను నేను మారుస్తాను." అని చెప్పింది సుజాత. (సశేషం)

Part 4

"మరో విషయం అమ్మా! నెమ్మదిగా ఇంటి పనిమనిషికీ, కూరలు అమ్మే అమ్మాయికి అప్పుడప్పుడు అమ్మత్తకు వదినగా నిన్ను నువ్వు పరిచయం చేసుకో. ఆడవాళ్ళు నిన్ను ఒక స్త్రీ గా అంగీకరిస్తే మగవాళ్ళని ఒప్పించటం పెద్ద కష్టం కాదు. అలాకాకుండా ముందు మగవాళ్ళని ఒప్పించాలని ప్రయత్నిస్తే నిన్ను అందరూ"తేడా" అంటూ ఎగతాళి చేస్తారు. నిజం అందరికీ తెలిసే వరకూ నువ్వు ఈ విషయం లో ఇలా ధైర్యం చెయ్యమని చెప్పింది.
ఇలా ఒక పక్కనుంచి మోహన్ మోహనగా రూపుదిద్దుకుంటోంది. పదిహేనవ రోజు రాజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అనుకుంటే మరి పదిహేను రోజులపాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఈ నెలరోజుల్లో సుజాత రాజీకి చాలా దగ్గరైంది. సుజాత అంటే చెప్పలేనంత ప్రేమ పెంచుకుంది రాజీ. పనికట్టుకుని అప్పుడప్పుడు మోహన్ ఆడ ఫోటోలను రాజికి చూపించేది. రాజికి వంట్లో బాలేదు అని రాజి అమ్మ, నాన్న, మోహన్ అమ్మ, నాన్న మరికొంతమంది చుట్టాలు వచ్చారు. అందరికీ మోహన్ ఫోటోలతో పరిచయం అయ్యింది. మోహన్ కి అడపాదడపా స్త్రీ లాగా ముస్తాబయి చుట్టు పక్కల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అలవాటైంది. చుట్టాలందరూ మోహన్ ని మోహనా అనిపిలవటం మొదలు పెట్టారు. మోహన అందాన్ని చుట్టాలంతా తెగపొగటం మొదలు పెట్టారు. రాజీకి కొంచెం గర్వం పుట్టింది. సుజాత నెమ్మదిగా రాజీ చెవిలో "అత్త, మా అమ్మ చూడు. ఎంత అందంగా ఉందో?" అని అడిగేది.
రాజి "అది కాదే సుజీ! ఆయన నా మొగడే." అంది. కనుకనే నీ మొగుడి ఇష్టాన్ని గౌరవించత్తా" అని సుజాత చెప్పింది. రాజీ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాకా తన భర్తను అందరితో మాట్లాడేటప్పుడు "మోహన ఎక్కడుంది?"అని అడిగేది. "అలాగే మోహన్ ను మోహనా" అని డైరెక్ట్ గా పిలవటం మొదలు పెట్టింది.
ఇలా సుజాత ఇచ్చిన ధైర్యంతో మోహన్ మోహన గా ఎన్నో విజయాలు సాధించింది.
సమాప్తం


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Thank you akka. Mee problems anni solve ayyaka manam tappaka kaluddam.

Meghana Meghana

@gvgarima akka, enduko teliyadu mee ee kadalaku nenu vasam ayipotunna(chala +ve sense loney cheputnnanu)..Oka rakamaina chakkani prema, edo teliyani anubhuthi kalugutunnai mee kadalu chaduvutuntey. Akka meeru permission istey mee kadalu na personal website lo kuda pedatha mee peru meeda. Na personal website lo eppati varaku na kadalu tappa verey valla kathalu(mari close ayithey tappa) pettaledu. Naku meeku ela krutagnyatalu cheppalo kuda teliyatam ledu. Mimmalni kalavalani vundi..aa bagavantudu avakasam istey kachhitanga kalustanu..itlu mee chelli Meghana.

gvgarima gvgarima (Author)

ప్రియమైన చెల్లెలు మేఘన గారికి, మీ పర్సనల్ వెబ్సైట్ లో నాకథలు ఉంచటం అంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు కృతజ్ఞతలు. మీరు తప్పక మీ వెబ్సైట్ లో నా కథలను ఉంచండి. ఇంకా మనం వైయక్తికంగా కలవటానికి మరొక సంవత్సరం పడుతుంది. నేను ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉన్నాను. ఆ సమస్యలనుంచి బయటపడటానికి మరొక సంవత్సరం పడుతుంది. ఒక సంవత్సరం తరువాత మనం తప్పకుండా కలుద్దాం. మీ ప్రోత్సాహానికి, అభిమానానికి చాలా కృతజ్ఞురాలు. మీ అక్క గరిమ